Tuesday, January 16, 2018

హ‌నుమంతుడే న్యాయ‌మూర్తి...


భగవంతుణ్ణి పూజించడం కేవలం కోర్కెలు తీర్చుకోవడం వరకే పరిమితం కాదు. నిజానిజాల నిరూపణకూ అవసరమవుతుంటుంది. చత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ పట్టణంలోని మగర్‌పార్ ప్రాంతంలో విచిత్రమైన హనుమాన్ ఆలయం ఉంది. ఈ గ్రామంలోనివారంతా హనుమంతుణ్ణి తమ ఇంటి ఇలవేల్పుగా భావిస్తారు. బిలాస్‌పూర్‌లో హైకోర్టు ఉన్నప్పటికీ, చాలా వివాదాలు ఈ హనుమంతుని ఆలయంలోనే పరిష్కారమవుతాయి. ఆంజనేయుడు అందరి కష్టాలను కడతేరుస్తాడని ఇక్కడి వారు నమ్ముతారు. హనుమంతుని సాక్షిగా ఇక్కడ పంచాయతీ నిర్వహించడంతోపాటు, నిర్ణయం కూడా హనుమంతునిదేగా భావిస్తారు. దీనిని ‘బజరంగీ పంచాయత్’ అని అంటారు. ఇక్కడ గత 80 సంవత్సరాలుగా హనుమంతుని సమక్షంలోనే తీర్పులు వెలువడుతున్నాయి. ఈ ప్రాంతంలో ఎవరికి ఎటువంటి సమస్య ఎదురైనా హనుమంతుని ఆలయానికి వచ్చి పంచాయతీకి విన్నవించుకుంటారు. ఇక్కడ అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు.